ఈనాడు: క్యాన్సర్‌ ముప్పును గుర్తించవచ్చు

అందుబాటులోకి డీఎన్‌ఏ ఆంకోస్క్రీన్‌

ఈనాడు, హైదరాబాద్‌: జన్యు విశ్లేషణతో మానవునిలో కొన్ని రకాల క్యాన్సర్లను ముందే గుర్తించవచ్చని మ్యాప్‌మై జీనోమ్‌ సంస్థ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ సీఈవో అనూ ఆచార్య, లూసిడ్‌ మెడికల్‌ డయాగ్నస్టిక్‌ వైద్యులు ఎం.విద్యాసాగర్‌, సునీతా లింగారెడ్డి తెలిపారు. డీఎన్‌ఏ ఆంకోస్క్రీన్‌ పేరుతో తొలిసారి ఈ పరీక్షలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి డీఎన్‌ఏ పటంతోపాటు బయో కెమికల్‌ ప్రొఫైల్‌ను నిశితంగా పరీక్షిస్తామన్నారు. దీంతో దాదాపు 14 రకాల క్యాన్సర్లకు సంబంధించి జన్యువుల్లో మ్యుటేషన్లు(మార్పులు) గుర్తించే వీలుందని పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరిద్దరికి క్యాన్సర్‌ ఉంటే మిగతా కుటుంబ సభ్యుల్లో కన్పించే అవకాశం ఉందన్నారు. దీంతో ఈ స్క్రీనింగ్‌ ద్వారా జన్యువుల్లో క్యాన్సర్ల కారక మ్యుటేషన్లు ఉంటే కనిపెట్టవచ్చని వివరించారు. భారత్‌లో ఎక్కువగా కన్పిస్తున్న రొమ్ము, గర్భాశయ ముఖ ద్వార, ఊపిరితిత్తులు, కాలేయం, పెద్దప్రేగు క్యాన్సర్ల బారినపడే ముప్పు ఉందేమో జన్యు మ్యాపింగ్‌ ద్వారా గుర్తించే వీలుందని చెప్పారు.
మ్యుటేషన్లలో తేడా ఉన్నంత మాత్రాన చెప్పలేం..
కాగా మ్యుటేషన్లలో తేడా ఉన్నంత మాత్రాన క్యాన్సర్‌ వస్తుందని చెప్పలేమని వైద్యులు తెలిపారు. 5 శాతం మాత్రమే ఆ పరిస్థితి ఉంటుందన్నారు. జన్యు విశ్లేషణ వల్ల చాలా రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉందని వారు వివరించారు.


 
Originally published: https://www.eenadu.net/statenews/2019/02/22/62653/
Date of publication: February 22, 2019